టీబీ రహిత గ్రామంగా బచ్చాయిపల్లి

జిల్లాలో 12 గ్రామ పంచాయతీలకు చోటు

Siddipet Bureau
1 Min Read

సిద్దిపేట రూరల్,అక్టోబర్ 08 ,(ప్రజాజ్యోతి):క్షయ వ్యాధి నిర్మూలన దిశగా చేపట్టిన కార్యక్రమాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు బచ్చాయిపల్లి గ్రామ పంచాయతీకి అరుదైన గుర్తింపు లభించింది. సెంట్రల్ టీబీ డివిజన్ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి టీబీ రహిత గ్రామ పంచాయతీగా బచ్చాయిపల్లి ఎంపికైంది. సిద్దిపేట జిల్లాలో ఈ అవార్డుకు ఎంపికైన 12 గ్రామ పంచాయతీల్లో బచ్చాయిపల్లి కూడా స్థానం సంపాదించింది.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి జిల్లాస్థాయి అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు. జిల్లా మెడికల్ ఆఫీసర్ డా. ధన్‌రాజ్, టీబీ ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్ డా. వినోద్ బాబ్జీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ను గ్రామ సర్పంచ్ దుర్గం ప్రేమలత యాదగిరికి అందజేశారు.టీబీ అంటువ్యాధి అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు తెలిపారు. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు, ఉచిత చికిత్స అందుబాటులో ఉన్నాయన్నారు.రెండు వారాలకు మించి దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. కఫంలో రక్తం పడటం, రాత్రివేళ జ్వరం, ఆకలి మందగించడం, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామస్థుల సహకారం, నిరంతర అవగాహన కార్యక్రమాలతో టీబీ నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *