ప్రగతి పరుగుకు పదేళ్లు

-సిద్దిపేటకు యూనివర్సిటీ తీసుకొస్తాం -జిల్లా కలను నిజం చేసిన కేసీఆర్ -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Siddipet Bureau
2 Min Read

సిద్ధిపేట,అక్టోబర్ 09 ,(ప్రజాజ్యోతి):సిద్దిపేట జిల్లా ఆవిర్భావంతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిందని, విద్య, వైద్యం, క్రీడలు, మౌలిక వసతుల రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన 10కే రన్‌ను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ పరుగులో వేలాది మంది యువత, విద్యార్థులు, క్రీడాకారులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని ఉత్సాహాన్ని చాటారు. హరీశ్ రావు కూడా వారితో కలిసి పరుగెత్తారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో నాటుకుపోయిన ఆకాంక్ష అని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో జిల్లా ఏర్పాటు హామీలు, గోడలపై నినాదాలు ఎన్నో సంవత్సరాల పాటు కనిపించేవని, 2016 అక్టోబర్ 11న ఆ కల సాకారమైందని తెలిపారు. జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ ప్రజల భాగస్వామ్యంతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సిద్దిపేట పర్యటనకు వచ్చిన సమయంలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఏర్పాటు కోరుతూ వినతిపత్రం సమర్పించారని తెలిపారు. అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పుడు సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసి దశాబ్దాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు.జిల్లా ఏర్పాటుకు ముందు అనేక ప్రభుత్వ అవసరాల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఉద్యోగ నియామక పరీక్షలు, క్రీడా పరీక్షల్లో పాల్గొనడానికి కూడా దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చేదని తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే అనేక ప్రభుత్వ సేవలు, పరీక్షల నిర్వహణకు అవకాశాలు ఏర్పడ్డాయని వివరించారు. కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, క్రీడా మైదానాల ఏర్పాటుతో సిద్దిపేట ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు.సిద్దిపేట జిల్లా ఏర్పాటు, రైలు మార్గం, గోదావరి జలాల సాధన ప్రజల చిరకాల స్వప్నాలని, ఈ మూడు ఆకాంక్షలు నెరవేరడం ప్రాంత అభివృద్ధిలో కీలక మలుపుగా నిలిచిందన్నారు. రంగనాయకసాగర్‌లో గోదావరి జలాలు, సిద్దిపేటకు రైలు రాక, జిల్లా కేంద్రంగా పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు ఈ మార్పులకు నిదర్శనమన్నారు.విద్యారంగంలో సిద్దిపేట ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. మెడికల్, నర్సింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, పీజీ, మహిళా డిగ్రీ, మేనేజ్‌మెంట్ తదితర విద్యాసంస్థలతో విద్యా కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. ఈ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దిపేటలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.పదేళ్ల అభివృద్ధిని సమీక్షించుకోవడంతో పాటు రాబోయే పదేళ్లలో సిద్దిపేటను ఏ స్థాయికి తీసుకెళ్లాలనే దానిపై స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. నేటి 10కే రన్ కేవలం క్రీడా కార్యక్రమం మాత్రమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలి, యువతలో పట్టుదల, జిల్లా అభివృద్ధిపై సమష్టి సంకల్పానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.సిద్దిపేటను మరింత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, యువత కలిసి పనిచేయాలని, భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యా అవకాశాలు, సదుపాయాలు అందించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *