ఉత్తర భారత పర్యటనకు జక్కాపూర్ విద్యార్థులు

ఈ నెల 10 నుంచి 17 వరకు ఎనిమిది రోజుల విద్యా విజ్ఞాన యాత్ర

Siddipet Bureau
2 Min Read

నారాయణరావుపేట , అక్టోబర్ 8 ,(ప్రజాజ్యోతి):పాఠ్యపుస్తకాల్లో నేర్చుకున్న చరిత్ర, సంస్కృతి, ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రత్యక్షంగా తెలుసుకునే అరుదైన అవకాశం జక్కాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు లభించింది. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా విజ్ఞానాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఉత్తర భారత విద్యాయాత్రకు జక్కాపూర్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.పాలమూరు ఎన్ఆర్ఐ ఫౌండేషన్, డ్రీమ్ ఫోర్స్, తెలంగాణ ఫిలడెల్ఫియా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. తెలంగాణలోని పలు జిల్లాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 45 మంది విద్యార్థులు, ఐదుగురు గైడ్ టీచర్లు యాత్రలో భాగస్వాములు కానున్నారు.యాత్రలో భాగంగా ఢిల్లీ, ఆగ్రా, అమృత్‌సర్, మధుర, బృందావన్ తదితర ప్రాంతాల్లోని సుమారు 23 చారిత్రక, సాంస్కృతిక, విద్యా ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సందర్శించనున్నారు. ఎర్రకోట, పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, కుతుబ్‌మినార్, జంతర్‌మంతర్, ప్రధానమంత్రి సంగ్రహాలయం, వాఘా సరిహద్దు వంటి ప్రాంతాలను సందర్శించడం ద్వారా దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం, ప్రజాస్వామ్య వ్యవస్థ, పరిపాలనపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కలగనుంది.అక్షర్‌ధామ్, తాజ్‌మహల్, స్వర్ణ దేవాలయం వంటి ప్రముఖ కట్టడాలను సందర్శించడం ద్వారా భారతీయ కళా వైభవం, నిర్మాణ శైలి, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం లభించనుంది. మధుర, బృందావన్‌లోని శ్రీకృష్ణ జన్మస్థానం, ప్రముఖ ఆలయాల సందర్శనతో దేశంలోని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా అనుభవించనున్నారు.ఈ తరహా యాత్రలు విద్యార్థుల్లో పుస్తక జ్ఞానానికి మించి అనుభవాత్మక అభ్యాసాన్ని పెంపొందిస్తాయని, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తాయని నిర్వాహకులు తెలిపారు.జక్కాపూర్ ఉన్నత పాఠశాల నుంచి సారుగు హరికృష్ణ, ఎర్రయ్య, సుశాంత్ విద్యార్థులు ఎంపిక కాగా, గైడ్ టీచర్‌గా పాఠశాల గణిత ఉపాధ్యాయుడు పాతూరి తిరుపతిరెడ్డి ఎంపికయ్యారు.వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిబిరంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థుల్లో నుంచి ఇద్దరిని ఈ యాత్రకు ఎంపిక చేయడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొమ్మూరి పద్మ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆకాంక్షించారు. యాత్ర విజయవంతంగా సాగాలని ఆమె కోరారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *