జర్నలిజంలో రెండు దశాబ్దాల ప్రస్థానం

Rammoorthy Kamareddy
3 Min Read

జర్నలిజంలో రెండు దశాబ్దాల ప్రస్థానం

— బొక్కల వేణు ముదిరాజ్

కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 26 (ప్రజా జ్యోతి)

ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటం

దూరదర్శన్‌ కెమెరామెన్‌ గా ఆరంభం,10 టీవీ రిపోర్టర్‌గా కొనసాగింపు జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి

ప్రస్తుతం మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు

ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జర్నలిస్టుల సమస్యలపై గళమెత్తడం వృత్తిలో ఎదురైన ఒత్తిళ్లను, సవాళ్లను అధిగమిస్తూ దాదాపు రెండు దశాబ్దాలుగా జర్నలిజం లో కొనసాగుతున్న బొక్కల వేణు ప్రస్థానం ప్రత్యేకంగా నిలుస్తోంది.

కెమెరామెన్‌గా తొలి అడుగు….!

2008 లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్సా టీవీ ద్వారా జర్నలిజంలోకి అడుగు పెట్టిన బొక్కల వేణు 2009 లో సీనియర్ జర్నలిస్టు, దివంగత దమ్మాయి గంగాధర్ మార్గదర్శకత్వంలో కెమెరామెన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2010లో సీనియర్ జర్నలిస్టు రామగిరి శర్మసహకారంతో దూరదర్శన్‌లో కెమెరామెన్‌గా అవకాశం లభించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 36 మండలాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా కవర్ చేశారు.

ఉద్యమ సమయంలోనూ వెనుకడుగు లేదు….!

మలిదశ తెలంగాణ ఉద్యమం సమయంలో జర్నలిస్టుగా బొక్కల వేణు చురుకైన పాత్ర పోషించారు. సకల జనుల సమ్మె, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను ప్రత్యక్షంగా కవర్ చేశారు. కామారెడ్డి బస్టాండ్‌లో ఆందోళనలను కవర్ చేస్తున్న సమయంలో పోలీసులు జర్నలిస్టులపై లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. గాయపడిన జర్నలిస్టులను ఆసుపత్రికి తరలించడంతో పాటు పోలీసుల చర్యకు వ్యతిరేకంగా జర్నలిస్టులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా కరీం అనే యువకుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న ఘటనను కవర్ చేస్తున్న సమయంలో ఆందోళనకారులు రైలు పై రాళ్ల దాడికి దిగారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ వార్తా సేకరణకు ప్రాధాన్యమిస్తూ ఘటనను కవర్ చేశారు.

రైతుల పక్షాన నిలిచిన కలం…!

తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో మొక్కజొన్న తూకం విషయంలో రైతులు, పోలీసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ ఘటనలో కొందరు రైతుల పై రౌడీషీట్లు తెరిచి వారి ఫొటోలను పోలీస్‌ స్టేషన్‌లోని బోర్డు పై ఉంచారు. దీని పై 10టీవీలో వరుస కథనాలు ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. రైతుల పై రౌడీషీట్లు ఎత్తివేయడంతో పాటు బోర్డుపై ఉన్న వారి ఫొటోలను తొలగించారు. ప్రజా సమస్యను వార్తగా మలిచి పరిష్కారం దిశగా నడిపిన ఘటనగా ఇది నిలిచింది.

భూ వ్యవహారాలపై వార్తలు…!

ఒత్తిళ్లను ఎదుర్కొని ఎల్లారెడ్డి ప్రాంతంలో భూ వ్యవహారాలపై రైతుల తరఫున వార్తలు ప్రసారం చేసిన సమయంలోనూ బొక్కల వేణు పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పటి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి హయాంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డికి సంబంధించిన భూ వ్యవహారాలపై కథనాలు ప్రసారం చేయడం తో ఆయన అనుచరులు కామారెడ్డి ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అయినప్పటికీ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వెనుకడుగు వేయలేదు.

జర్నలిస్టుల కోసం మరో పోరాటం…!

జర్నలిస్టుగా ప్రజా సమస్యల పై పోరాడుతూనే తోటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కూడా బొక్కల వేణు కృషి చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెండుసార్లు, జిల్లా కార్యదర్శిగా ఒకసారి బాధ్యతలు నిర్వహించారు. జర్నలిస్టుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పలు కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొన్నారు.

పీఆర్వోగా మరో బాధ్యత….!

2018లో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మదన్‌మోహన్‌రావుకు పీఆర్వోగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు పీఆర్వోగా సేవలందిస్తున్నారు.

అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడిగా..!

దాదాపు రెండు దశాబ్దాల జర్నలిజం ప్రస్థానంలో కెమెరామెన్‌గా మొదలైన ప్రయాణం రిపోర్టర్‌గా కొనసాగుతూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే స్థాయికి చేరింది. జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతూ, వారి హక్కుల కోసం గళమెత్తిన బొక్కల వేణు ప్రస్తుతం కామారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యే తన సమస్యగా భావిస్తూ వార్తను ఆయుధంగా చేసుకుని పరిష్కారం కోసం పనిచేస్తున్న బొక్కల వేణు రెండు దశాబ్దాల ప్రస్థానం జర్నలిజం పట్ల అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *