సెట్‌బ్యాక్‌లు మాయం.. ప్రమాదకరంగా నిర్మాణాలు..
కూల్చిన మెట్లు మళ్లీ ప్రత్యక్షం.. అధికారుల తీరుపై ప్రశ్నలు
చేవెళ్ల ప్రజా జ్యోతి
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజాపూర్ జాతీయ రహదారి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సెట్‌బ్యాక్‌లు పాటించకుండా రహదారికి అతి సమీపంలో మెట్లు నిర్మించడంతో వాహనదారులు, పాదచారులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు.
మున్సిపల్ కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలోని మోర్ షాపింగ్ మాల్ వద్ద కొద్ది రోజుల క్రితం అధికారులు కూల్చివేసిన మెట్లు మళ్లీ నిర్మించబడడం చర్చనీయాంశంగా మారింది. అక్రమమని తొలగించిన నిర్మాణాలు తిరిగి ఎలా వెలిశాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల వైఖరిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల వెనుక భారీ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.
హైవే పక్కనే ప్రమాదకరంగా ఉన్న మెట్లను వెంటనే తొలగించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

