గరిడేపల్లి,జూలై 23 (ప్రజా జ్యోతి):సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో విక్రయించిన బూజు పట్టిన కేక్ తిని పలువురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన ఆందోళన కలిగించింది.సర్వారం గ్రామానికి చెందిన భరత్ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా బుధవారం కీతవారిగూడెంలోని ఫేమస్ బేకరీలో ఒక కిలో కేక్ కొనుగోలు చేశాడు.అదే రోజు రాత్రి పుట్టినరోజు వేడుకలో కుటుంబ సభ్యులు,చిన్నారులకు కేక్ వడ్డించారు. కేక్ తిన్న అనంతరం దానిని పరిశీలించ గా లోపల బూజు (ఫంగస్) పట్టి ఉన్నట్లు గుర్తించారు.కేక్ తిన్న పలువురు చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఘటనపై గురువారం బాధిత కుటుంబ సభ్యులు,స్థానికులు కీతవారిగూడెంలోని ఫేమస్ బేకరీ వద్దకు చేరుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఫిర్యాదు చేసినప్పటికీ బేకరీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇటువంటి ఘటనలను తీవ్రంగా పరిగణించి ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) అధికారులు,గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే బేకరీపై తనిఖీలు నిర్వహించి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అయితే ఈ ఆరోపణలపై స్పందించిన బేకరీ నిర్వాహకులు,కీతవారిగూడెం ఫేమస్ బేకరీలో కేకులు తయారు చేయడం లేదని,గరిడేపల్లిలోని ఫేమస్ బేకరీలో తయారైన కేకులను తీసుకొచ్చి విక్రయిస్తున్నామని తెలిపారు.ఘటనపై అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
