శబ్ద కాలుష్యానికి కారణమైన డీజే స్వాధీనం
ఆపరేటర్‌పై కేసు నమోదు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
దేవునిపల్లి ఎస్సై రంజిత్ హెచ్చరిక
కామారెడ్డి, టౌన్ సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి
శబ్ద కాలుష్యానికి కారణమవుతూ అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తున్న వ్యక్తిపై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి డీజే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం పరిధిలోని శబ్దిపూర్ తండాలో సోమవారం చోటుచేసుకుంది.
శబ్దిపూర్ తండాలో ఓ వ్యక్తి అధిక శబ్దంతో డీజేను ఆపరేట్ చేస్తూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నట్లు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అనంతరం డీజే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా దేవునిపల్లి ఎస్సై రంజిత్ మాట్లాడుతూ ప్రజలు పండుగలు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించే సమయంలో తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు, పోలీసు శాఖ సూచనలను పాటించాలని సూచించారు. అధిక శబ్దంతో డీజేలు, సౌండ్ సిస్టమ్‌లు నిర్వహించడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని తెలిపారు.
ముఖ్యంగా పండుగల సందర్భంగా యువకులు, నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్సై రంజిత్ సూచించారు. అనుమతులు లేకుండా లేదా నిర్ణీత శబ్ద పరిమితులను దాటి డీజేలు నిర్వహించి శబ్ద కాలుష్యానికి కారణమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, పండుగలు, వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి నిబంధనలను పాటించాలని దేవునిపల్లి ఎస్సై రంజిత్ విజ్ఞప్తి చేశారు.
