- విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
- తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి..
- బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి
పరకాల, సెప్టెంబర్ 14, (ప్రజా జ్యోతి):
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు, పరకాల అసెంబ్లీ నియోజకవర్గ కాంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాద్‌రావు హాజరయ్యారు.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేపట్టిన పోలీసు చర్య అనంతరం విమోచనం లభించిందని ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అందువల్ల సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎంఐఎంతో రాజీపడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమాల నేపథ్యాన్ని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై రాష్ట్రాన్ని సాధించుకున్నారని, అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనకు పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ అవగాహన ఉందని ఆరోపించారు. బ్రిక్స్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
డాక్టర్ కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత ప్రజలపై రజాకారులు సాగించిన దాడులు, అకృత్యాలను చరిత్రలో మరువరాదన్నారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సబ్బండ వర్గాలు భాగస్వాములయ్యాయని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ హామీని విస్మరించారని విమర్శించారు.
పరకాల అభివృద్ధిపై మాట్లాడుతూ వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా ఎవరు తీసుకొచ్చినా స్వాగతిస్తామని అన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పరకాలకు వైద్య కళాశాల ఎందుకు గుర్తుకు రాలేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిలను ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పరకాలలో బీజేపీ బలపడితే అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, బెజ్జంకి పూర్ణ చారి, ఆకుల లావణ్య శ్రీధర్,జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, దంచనాదుల కిరణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య, ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి ఉడుత చిరంజీవి, జిల్లా నాయకులు బాసాని సోమరాజు, మండల అధ్యక్షులు పైండ్ల రంజిత్, నాయకులు కోడిల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
