వరంగల్ బ్యూరో, మార్చి 15 (ప్రజాజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యా బోధనమొదలయ్యింది. పైలెట్ ప్రాజెక్టు కింద శనివారం నుండి జిల్లాలోని 11 ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్య బోధన కార్యక్రమం ప్రారంభించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా బోధనను కలెక్టర్ ప్రారంభించారు. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా విద్యార్థులకు విద్యాబోధన అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. శనివారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జెల్లీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ) తో విద్య బోధన ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కంప్యూటర్ లో చేస్తున్న తెలుగు, ఆంగ్లానికి సంబంధించిన ప్రమాణాలను పరిశీలించారు. గణితంలో సంఖ్యా భావాలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు బాగాహారాలు, తెలుగులో విద్యార్థులు చేస్తున్న ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.