ముద్దులొలికే పట్టభద్రులు..

Bharath Gowd
2 Min Read

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నల్లటి గౌన్లు, తలపై గ్రాడ్యుయేషన్ టోపీలు.. చేతిలో పట్టాలు.. ముఖంలో చిరునవ్వులు. వీరెవరో యూనివర్సిటీ విద్యార్థులు అనుకుంటే పొరపాటే! అంగన్‌వాడీ ముంగిట అక్షర అభ్యాసం పూర్తి చేసుకుని, ప్రాథమిక పాఠశాల గడప తొక్కేందుకు సిద్ధమైన చిన్నారులు. బుధవారం నర్సాపూర్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రిస్కూల్ గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు స్థానిక సాయికృష్ణ గార్డెన్‌లో కన్నుల పండువగా జరిగాయి.

అమ్మ ఒడి నుంచి అక్షర బడికి..
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు,ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చిన్నారులకు పట్టాలు, మెడల్స్ అందజేసి అభినందించారు. “బాల్యమే దేశానికి బలమైన పునాది.. అంగన్‌వాడీలే ప్రగతికి తొలిమెట్టు” అని కొనియాడారు. ఈ సందర్భంగా చిన్నారి లోకం చేసిన నృత్య ప్రదర్శనలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి.

సోలార్ ప్లేట్లు, ఆకుకూరలు పునరుద్ధరించాలి: ఎంపీ
అంగన్‌వాడీ కేంద్రాల్లో సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసి, ఇండక్షన్ స్టవ్‌ల ద్వారా వంట చేయాలని, తద్వారా గ్యాస్ సమస్యను అధిగమించాలని ఎంపీ అధికారులకు సూచించారు. ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త తమ ఇళ్లలోనే ఆకుకూరలు పెంచాలని, అంతరించిపోతున్న పాతకాలపు రకాలను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు.

భవన నిర్మాణాలకు నిధుల హామీ, 30 ఏళ్ల సేవకు గౌరవం
పట్టణంలో కొత్త అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. సుమారు 30 ఏళ్లుకు పైగా నిరంతర సేవలు అందించిన ఆయాలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చిష్ యాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ హేమ భార్గవి, మండల సూపర్వైజర్లు శివకుమారి, సంతోషిమాత, మెహతా బేగంతో, సరళ కుమారి, కవిత, వసుమతి, లక్ష్మీ నరసమ్మ, సంతోష, సుల్తానా, లక్ష్మి , సుజాత తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *