కాబోయే భార్యను కాటికి పంపిన వరుడు..
అనుమానం తో హత్య
మరిపెడ, ఏప్రిల్25 (ప్రజాజ్యోతి)::
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో అనుమానం పెంచుకున్న ఓ యువకుడు తనకు కాబోయే భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం… మరిపెడ మండలం కొత్త తండాకు చెందిన అజ్మీర అరవింద్‌కు, ఇటుకలగడ్డ తండాకు చెందిన భూక్య సంగీత (20)తో వివాహం నిశ్చయమైంది.ఈ నెల 29న వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే ఇటీవల సంగీత ఇతరులతో చనువుగా మాట్లాడుతుందని భావించిన అరవింద్ అనుమానం పెంచుకున్నాడు.
అనుమానం క్రమంగా పెరగడంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సంగీతను బయటకు రమ్మని పిలిచి, బైక్‌పై తండా సమీపంలోని ఓ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మాటల్లో పెట్టి అనూహ్యంగా బావిలోకి తోసేశాడు. ఆమె మరణించే వరకు అక్కడే ఉండి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.సంగీత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణ ద్వారా అరవిందే నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.
