కామారెడ్డి డీపీఆర్‌వో కార్యాలయంలో అక్రిడిటేషన్ కార్డుల జారీపై వివాదం

Kamareddy
1 Min Read

కామారెడ్డి డీపీఆర్‌వో కార్యాలయంలో అక్రిడిటేషన్ కార్డుల జారీపై వివాదం

అక్రిడిటేషన్ కార్డుల జారీలో పారదర్శకత ఎక్కడ

కామారెడ్డి, ప్రతినిధి జూన్ 01. (ప్రజాజ్యోతి)

జిల్లా ప్రజా సంబంధాల కార్యాలయం (డీపీఆర్‌వో)లో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక నిర్దిష్ట జర్నలిస్టు సంఘం కనుసన్నల్లోనే అక్రిడిటేషన్ కార్డులు జారీ అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నిరంతరం జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న పలువురు విలేకరులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు కాకపోగా, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ప్రస్తుతం మీడియా రంగంలో చురుకుగా లేని కొందరికి మాత్రం కార్డులు జారీ చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు గుర్తింపు లభించకపోవడం, ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. అక్రిడిటేషన్ కార్డులు మంజూరైనప్పటికీ వాటిని సంబంధిత జర్నలిస్టులకు అందజేయకుండా డీపీఆర్‌వో కార్యాలయంలోనే నిల్వ ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రిడిటేషన్ కార్డుల మంజూరు, పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు విలేకరులు కోరుతున్నారు. ఈ ఆరోపణలపై జిల్లా ప్రజా సంబంధాల శాఖ అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *