వెల్దుర్తి (ప్రజాజ్యోతి) జూన్ 09:
పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య అలాగే 560 మార్కులతో మండల టాపర్‌గా నిలిచిన విద్యార్థిని అక్షయను జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు పాల్గొని అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం పాఠశాల కు ఎంతో గర్వకారణంగా నిలిచింది.ప్రధానోపాధ్యాయులు సాంబయ్య సమర్థ నాయకత్వం, ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ అద్భుత విజయానికి బలమైన పునాది వేశాయి. ప్రభుత్వ పాఠశాల కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించగలదని వెల్దుర్తి జెడ్పీహెచ్‌ఎస్ మరోసారి నిరూపించింది.అదే విధంగా 560 మార్కులతో మండల టాపర్‌గా నిలిచిన అక్షయకు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం జరగడం ఆమె ప్రతిభకు దక్కిన గొప్ప గుర్తింపు. సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ అసాధారణ ఫలితాలు సాధించిన అక్షయ, నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సాంబయ్య మాట్లాడుతూ, ఈ విజయానికి ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారమే కారణమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా పాఠశాల ముందుకు సాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఖదీర్ పాషా, విజయ్ మోహన్ రాజ్, అర్చన, జయసుధ, శైలజ, సృజన తదితరులు పాల్గొన్నారు
