సొసైటీలకు నూతన పాలకవర్గాలు..!!
రైతులకు సేవలందించడమే లక్ష్యం!
పెద్దాపూర్ (ఊరుగొండ) సొసైటీపై ఉత్కంఠ, ఆశావహుల్లో ఎదురుచూపులు
ఆత్మకూరు సొసైటీ చైర్మన్‌గా ‘నాగెల్లి స్వప్న’
పెంచికలపేట సొసైటీ చైర్మన్‌గా ‘ఎగితే లింగయ్య’
ఆత్మకూరు, అక్టోబర్ 15 (ప్రజాజ్యోతి):
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నూతన పాలకవర్గాలను ప్రకటించారు. ఈ మేరకు ఆయా సొసైటీలకు చైర్మన్లు, డైరెక్టర్లను అధికారులు నియమించారు. నూతన పాలకవర్గాల ప్రకటనతో సహకార సంఘాలపై ఆశలు పెట్టుకున్న ఆశావహుల్లో కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు, బాధ్యతలు చేపట్టనున్న నూతన కమిటీలు రైతులకు ఎలాంటి సేవలందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఆత్మకూరు సొసైటీ చైర్మన్‌గా ‘నాగెల్లి స్వప్న’
ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా నాగెల్లి స్వప్నను నియమించారు. డైరెక్టర్లుగా కంచ రవికుమార్, వెలిదే వెంకటేశ్వర్లు, మంతుర్తి రవి, కాడబోయిన రవి, అల్వాల రవి, పులిచేరు విజయకుమార్, లోకబోయిన దేవేందర్, బలబద్ర కృష్ణకిషోర్, పోరెడ్డి ప్రసూన, బుస్స రఘు, బూర సంతోష్ బాబు, పరికి లక్ష్మయ్యలను నియమించారు.
పెంచికలపేట సొసైటీ చైర్మన్‌గా ‘ఎగితే లింగయ్య’
పెంచికలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా ఎగితే లింగయ్యను నియమించారు. డైరెక్టర్లుగా బతుకుల రవీందర్ రెడ్డి, ఉప్పరి సునీత, అర్షం సూరమ్మ, నీలం సుభాష్, పిట్టల రమాదేవి, కోడిపాక కుమారస్వామి, మన్నె రాజమౌళి, పులిచేరు పుల్లయ్య, లక్కర్సు రజిత, లక్కర్సు లింగమూర్తి, ఎర్ర శివారెడ్డిలను నియమించారు.
పెద్దాపూర్ సొసైటీపై ఉత్కంఠ..!
మండలంలోని పెద్దాపూర్ (ఊరుగొండ) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సొసైటీ చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ స్థానాల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో పాలకవర్గం ప్రకటనలో జాప్యం జరుగుతోందని అధికార పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. నూతన పాలకవర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశంపై ఆసక్తి కొనసాగుతోంది.
రైతులకు మెరుగైన సేవలు..
నూతనంగా నియమితులైన పాలకవర్గాలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ, వ్యవసాయ రుణాలు, ఇతర సహకార సేవలను సకాలంలో అందించేందుకు కృషి చేయాలని రైతులు ఆశిస్తున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సొసైటీలు పనిచేసి, వ్యవసాయ రంగానికి మరింత తోడ్పాటు అందించాల్సిన బాధ్యత నూతన పాలకవర్గాలపై ఉంది.
