సిద్దిపేట, అక్టోబర్ 15 (ప్రజాజ్యోతి):సిద్దిపేట పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిపారవశ్యంతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ని శ్రీనివాస్ నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన దుర్గామాతను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సందర్శించారు. మండపం లో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. సిద్దిపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.
