వారం రోజుల్లో పెళ్లి… బావిలో శవమై తేలిన పెళ్లికూతురు..!!
మరిపెడ, ఏప్రిల్ 22 (ప్రజాజ్యోతి)::
మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ యువతి అనుమానాస్పద స్థితిలో బావిలో మృతదేహంగా కనిపించడం స్థానికంగా విషాదాన్ని కలిగించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఇటుకల గడ్డ తండాలో బుధవారం వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న, వినోదల కుమార్తె భూక్య సంగీత(20) మరియు కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవింద్ కుమారుడు అజ్మీర అరవింద్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ వివాహానికి తొలుత ఇరు కుటుంబాలు వ్యతిరేకించగా, పెద్దలను ఒప్పించేందుకు సంగీత గతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. దీంతో చివరికి ఇరు కుటుంబాలు అంగీకరించి ఈ నెల 29న పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంగీత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ సంగీతను తనతో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు.
బావి సమీపంలో రక్తపు మరకలతో కూడిన చెప్పులు కనిపించడం యువతి మృతి పై అనుమానాలకు తావిస్తోంది. ఇది ఆత్మహత్యా..? లేక హత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
