హైదారాబాద్/నర్సాపూర్ (ప్రజాజ్యోతి) రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందనే మాటలో వాస్తవం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. సాధారణం కంటే 50 నుంచి 60 శాతం అధికంగా విక్రయాలు జరగడంతో, కొన్ని బంకుల్లో తాత్కాలికంగా ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. ముఖ్యంగా హైదరాబాద్, అత్తాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ, మెదక్ జిల్లాలో కొన్ని బంకుల్లోనూ ఈ పరిస్థితి కనిపించింది. డీలర్లకు సరఫరాలో చిన్నపాటి జాప్యం జరిగిందని, అంతేకానీ నిల్వలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు వివరించారు.
