కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీపీఐకి బేషరతుగా మద్దతు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది.
కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ అత్యధిక స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో, తాము మద్దతు ఇస్తామని కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి తెలిపారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. మీరు గెలిచారు కాబట్టి మీకు మద్దతు ఇస్తాం అని కేటీఆర్ చెప్పినట్లు ఆయన ధృవీకరించారు.
కూనంనేని మాట్లాడుతూ.. మేయర్ పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమన్నారు. ఇది తమకు వచ్చిన గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. ఎవరైనా మద్దతు ఇస్తే స్వాగతిస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని, మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్‌తో పాటు పలువురు ఇండిపెండెంట్లు కూడా మద్దతు ఇస్తామని ముందుకు వచ్చినట్లు తెలిపారు. అయితే పొత్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై మరో రెండు రోజుల్లో పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కూనంనేని తెలిపారు.
