అమెరికా డీల్ ఎఫెక్ట్: భారీ లాభాలతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

V. Sai Krishna Reddy
1 Min Read

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తామని ప్రకటించడం మదుపరులలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ పరిణామం భారతీయ కంపెనీలకు, ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందన్న అంచనాలతో దలాల్ స్ట్రీట్‌లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,072.67 పాయింట్లు ఎగబాకి 83,739.13 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 639.15 పాయింట్లు లాభపడి 25,727.55 వద్ద ముగిసింది. నిఫ్టీకి 25,500-25,600 ప్రాంతం కీలకమైన మద్దతుగా నిలుస్తుందని, 25,900-26,000 స్థాయి రెసిస్టెన్స్‌గా ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.

అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, పవర్ గ్రిడ్ వంటి భారీ షేర్లు లాభాల్లో ముందుండగా.. టెక్ మహీంద్రా, బెల్ (BEL) మాత్రం నష్టాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే అన్ని సెక్టార్ల సూచీలు లాభాల్లోనే నిలిచాయి. ముఖ్యంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4 శాతానికి పైగా పెరగగా.. కెమికల్స్, ఫార్మా, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలు 3 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా దాదాపు 2.8 శాతం మేర లాభపడ్డాయి.

వాణిజ్య ఒప్పందానికి తోడు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.1.28 (దాదాపు 1.40%) మేర బలపడటం కూడా మార్కెట్ ఉత్సాహానికి కారణమైంది. 2018 డిసెంబర్ తర్వాత రూపాయికి ఇదే అతిపెద్ద ఒక్కరోజు గెయిన్ కావడం విశేషం. తాజా పరిణామాలతో విదేశీ పెట్టుబడులు (FIIs) మళ్లీ పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *