గత కొంతకాలంగా పైపైకి ఎగబాకిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజే ఏకంగా రూ. 1,500కుపైగా తగ్గింది. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 91,450కి దిగి వచ్చింది. వారం రోజుల క్రితం ఈ ధర రూ. 93 వేల స్థాయిలో ఉండగా, తాజా తగ్గుదలతో రూ. 92 వేల దిగువకు పడిపోయింది. ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గుచూపడంతోనే పుత్తిడి ధర దిగి వచ్చినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి. ఇక, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై రూ. 280 తగ్గి రూ. 90,380గా నమోదైంది.
పసిడితోపాటు వెండి ధరలు కూడా నిన్న దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో వెండి ధర కిలోకు రూ. 3 వేలు తగ్గి రూ. 92,500కు దిగి వచ్చింది. హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి ధర రూ. 1.03 లక్షలుగా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడంతోపాటు ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో మదుపర్లు విక్రయాల వైపు మొగ్గుచూపుతున్నారు. ధరలు తగ్గడానికి ఇదే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 10.16 డాలర్లు తగ్గి 3,027 వద్ద ఉండగా, వెండి 30.04 డాలర్ల వద్ద కొనసాగుతోంది.