ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళ వడదెబ్బతో మృతి
పర్వతగిరి, మే 22 (ప్రజాజ్యోతి)
పర్వతగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దీక్షకుంట్ల గ్రామానికి చెందిన చిర్రబోయిన అరుణ (45), భర్త మల్లయ్య, జీవనోపాధి కోసం కొంతకాలం క్రితం పర్వతగిరికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. రోజువారీ కూలి పనులతో కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె, రోజులాగే ఉపాధి హామీ పనులకు వెళ్లారు. అయితే తీవ్ర ఎండల కారణంగా పని సమయంలో వడదెబ్బకు గురైన అరుణ అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అరుణ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర ఎండల నేపథ్యంలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలకు తగిన జాగ్రత్తలు, తాగునీరు, నీడ ఏర్పాట్లు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
