ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాల నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన డీఈవో
వర్ధన్నపేట జనవరి 7, (ప్రజా జ్యోతి):
వర్ధన్నపేట మండలం ల్యాబర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి గ్రామ సర్పంచ్ మన్నూరు శారదా సోము అందిస్తున్న సహకారం అభినందనీయమని వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్య నాయుడు కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ శారదా సోము ని శాలువతో సత్కరించారు.
ల్యాబర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోసం సర్పంచ్ శారదా సోము ప్రత్యేకంగా రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రంగయ్య నాయుడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల మనుగడకు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ల్యాబర్తి పాఠశాల బలోపేతానికి సర్పంచ్ శారదా సోము గారు చేస్తున్న కృషి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా సర్పంచ్ గారు చొరవ తీసుకోవాలని డీఈవో సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ల్యాబర్తి ఉప సర్పంచ్ గంగరాజు, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వేణు, ఉపాధ్యాయులు హరిలాల్, వెంకటస్వామి, నాగరాజు, రఘువీర్, శివకుమార్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
