పాశమైలారం పేలుడు: 35కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

V. Sai Krishna Reddy
2 Min Read

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం జరిగిన పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 35కు పెరిగింది. భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

రియాక్టర్ పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే, ప్రమాద సమయంలో పనిచేస్తున్న కార్మికులు దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా నేలమట్టం కాగా, సమీపంలోని మరో భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి. సహాయక బృందాలు వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.

ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 108 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మరోవైపు, తమ వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు తరలివచ్చిన కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం వద్ద హృదయ విదారక దృశ్యాలు నెలకొన్నాయి.

ప్రమాదంలో వైస్ ప్రెసిడెంట్ దుర్మరణం
ఈ దుర్ఘటనలో పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఎల్.ఎన్. గోవన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన తన కారులో ప్లాంట్‌ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్న సమయంలోనే రియాక్టర్ పేలినట్టు తెలిసింది. పేలుడు ధాటికి ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ప్రభుత్వ స్పందన.. సహాయక చర్యలు
బాధితుల వివరాలు అందించేందుకు, వారి కుటుంబాలకు సాయపడేందుకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం 08455276155 నంబరును సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

ఈ ఘటనపై స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. ఇది చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. “ప్రమాద కారణాలను ఇప్పుడే చెప్పలేం. అన్ని విభాగాల అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు” అని ఆయన తెలిపారు. ఈ పరిశ్రమ గత 40 ఏళ్లుగా మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ అనే పౌడర్‌ను తయారు చేస్తోందని వివరించారు. మరో మంత్రి వివేక్ మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై సమీక్షించేందుకు త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషన్ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *