హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఛార్జీల తగ్గింపు!

V. Sai Krishna Reddy
2 Min Read

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఇది శుభవార్తే. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములను తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. నేటి అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (65)పై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు (నందిగామ) వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి.

పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు రూ. 15, రెండు వైపులా అయితే రూ. 30, తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఒకవైపు రూ. 25, ఇరువైపులా అయితే రూ. 40, బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి రూ. 50, ఇరువైపులా అయితే రూ. 75 వరకు టోల్ తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు రూ. 5, ఇరువైపులా అయితే రూ. 10 చొప్పున మాత్రమే టోల్ తగ్గించారు. అలాగే, 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25శాతం మినహాయింపు ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి.

తగ్గింపు అనంతరం ఇలా…
టోల్ తగ్గింపు అనంతరం పంతంగి టోల్ ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్, లైట్ మోటారు వాహనానికి ఒకవైపు రూ. 80, ఇరువైపులా అయితే రూ. 115 వసూలు చేస్తారు. కొర్లపహాడ్ వద్ద ఒకవైపునకు రూ. 120, ఇరువైపులా అయితే రూ. 180, చిల్లకల్లు ప్లాజా వద్ద ఒకవైపునకు 105, ఇరువైపులా అయితే 155 వసూలు చేస్తారు.

లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సుకు పంతంగిలో ఒకవైపునకు రూ. 125, ఇరువైపులా అయితే రూ. 190, కొర్లపహాడ్‌లో వరుసగా రూ. 195, రూ. 295, చిల్లకల్లులో వరుసగా రూ. 165, రూ. 250 చొప్పున వసూలు చేస్తారు.

బస్సు, లేదా ట్రక్కు (2 యాక్సిల్) వాహనాలకు పంతంగిలో ఒకవైపునకు రూ. 265, ఇరువైపులకు రూ. 395, కొర్లపహాడ్‌లో రూ. 410, రూ. 615, చిల్లకల్లు టోల్‌ప్లాజాలో రూ. 350, రూ. 520 వసూలు చేస్తారు.

వాణిజ్య రవాణా వాహనాల(3 యాక్సిల్)కు పంతంగిలో ఒకవైపునకు రూ. 290, ఇరువైపులా అయితే రూ. 435, కొర్లపహాడ్‌లో వరుసగా రూ. 450, రూ. 675, చిల్లకల్లులో రూ. 380, రూ. 570 వసూలు చేస్తారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *