నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం
-ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎడ్ల బండ్ల ప్రదర్శనలు
నాగిరెడ్డిపేట్,మార్చి29(ప్రజాజ్యోతి);
ఉగాది పర్వాదినాన్ని పురస్కరించుకొని నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడుపాయల జాతర తర్వాత అతిపెద్ద జాతరగా పేరొందిన శ్రీ నల్ల పోచమ్మ ఆలయం వద్ద మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో,కన్నులపండువగా జరుగుతాయి. మొదటి రోజు ఆలయం చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శన,రెండవ రోజు బోనాల ఊరేగింపు,మూడవ రోజు రథోత్సవం కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి.ఈ జాతర ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం నల్ల పోచమ్మ ఆలయం చుట్టూ మండలంలోని ఆయా గ్రామాల నుంచి 30ఎడ్ల బండ్లను సుందరంగా అలంకరించి భాజా భజంత్రీలు,డప్పు చప్పుల మధ్య ఎడ్ల బండ్ల ప్రదర్శనను కన్నుల పండుగగా నిర్వహించారు. ఎడ్లబండ్ల ప్రదర్శనను తిలకించేందుకు మండల కేంద్ర ప్రజలతో పాటు,చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ ఎడ్ల బండ్ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతర తిలకించడానికి వచ్చిన భక్తులు నల్ల పోచమ్మ ఆలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.ఎడ్లబండ్ల ప్రదర్శనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు తలెత్తకుండా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఐ రవీందర్ పర్యవేక్షణలో నియోజకవర్గంలోని సుమారు 60 మంది పోలీసు సిబ్బందిచే భారీ బందోబస్త్ నిర్వహించారు.