సాగర్ ఎడమ కాల్వలో యువకుడి గల్లంతు
నిడమనూరు,మార్చి 30 (ప్రజాజ్యోతి): నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాల్వలో యువకుడు గల్లంతైన ఘటన మండలం ముప్పారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన డి.పచాయప్పన్, విఘ్నేశ్తో పాటు మరికొందరు ముప్పారం గ్రామంలో ఉంటూ వరి కోత యంత్రం నడుపుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరి కోత పనుల నుంచి వచ్చిన పచాయప్పన్, అంబారసన్ కాళ్లు చేతులు కడుక్కునేందుకు ఎడమ కాల్వలోకి దిగారు. పచాయప్పన్ ప్రమాదవ శాత్తు కాలుజారి కాల్వలో పడిపోయి నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయాడు. అంబారసన్ కాల్వలోకి దూకి అతడిని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ మేరకు నిడమనూరు ఎస్ఐ గోపాల్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.