కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. తన ఓటమి తేలడంతో నరేందర్ రెడ్డి కౌంటింగ్ హాలు నుండి బయటకు వెళ్లిపోయారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి విజయాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. 63,404 ఓట్లతో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు.
అందరూ కలిసి నన్ను గెలిపించారు: అంజిరెడ్డి
బీజేపీ నేతలు, కార్యకర్తలంతా కలిసి తనను గెలిపించారని గెలుపొందిన అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావంతో బీజేపీ అభ్యర్థులం విజయాలు సాధిస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది: బండి సంజయ్
అంజిరెడ్డి గెలుపు కోసం చాలామంది కష్టపడ్డారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక్కడ గ్రాడ్యుయేట్, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులే గెలిచారని, ఇది చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇది తమకు నాలుగో విజయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలు, నిన్న టీచర్, నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. మోదీ నీతి, నిజాయతీతో కూడిన పాలనను గుర్తించి ప్రజలు పట్టం గడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల అమలు, ఉద్యోగాల భర్తీ, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
అంజిరెడ్డి గెలుపు నేపథ్యంలో కరీంనగర్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. అక్కడకు వచ్చిన బండి సంజయ్‌కి అంజిరెడ్డి స్వాగతం పలికారు. బండి సంజయ్, అంజిరెడ్డిలను కార్యకర్తలు తమ భుజాలపై కూర్చోబెట్టుకొని ఊరేగించారు.