నర్సాపూర్ (ప్రజాజ్యోతి) డబ్బుల కోసం కక్కుర్తి పడిన ఓ మీసేవ నిర్వాహకుడు నకిలీ జనన ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి బాధితులకు అంటగట్టిన ఘటన నరసాపూర్ పట్టణంలో వెలుగుచూసింది. మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన దుర్గయ్య అమృత దంపతులు తమ కుమార్తె జనన ధ్రువీకరణ పత్రం కోసం 2020లో వెంకట్రావుపేట్‌లోని ఓ మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయం నుంచి రావాల్సిన ఈ పత్రాన్ని, మీసేవ నిర్వాహకుడు అక్రమంగా రూ.2,000 వసూలు చేసి స్వయంగా నకిలీ పత్రాన్ని సృష్టించి ఇచ్చాడు. ఇటీవల కుమార్తె ఉన్నత చదువుల కోసం ఆ ద్రువపత్రన్ని స్కాన్ చేయగా అది ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని తెలిసింది. బాధితులు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించగా.. ఆ పత్రంపై ఉన్న అధికారి సంతకం ఫోర్జరీ అని, అది నకిలీదని అధికారులు స్పష్టం చేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.
