రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతనందించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకురాగా.. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా యువతి, యువకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. 16.22 లక్షల మంది తమ వ్యాపార ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు సబ్సీడీతో కూడిన పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాదికి ఈ పథకం కింద 5 లక్షల మంది అర్హులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. దీని కోసం రూ.6వేల 2వందల50 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో జూన్ 2న రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. రూ.50 వేల వరకు వంద శాతం, రూ.లక్ష వరకు 90 శాతం, రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ కింద రుణాలు మంజూరు చేయనున్నారు.
పేరు మార్చండి: కవిత డిమాండ్..
తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం పేరును బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ పేరును మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ అమర వీరులు శ్రీకాంత చారి, యాది రెడ్డి లేదా కాళోజీ లేదా పీవీ నరసింహా రావులలో ఎవరి పేరైన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.