డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మడివరం మండలం, కమినిలంక సమీపంలోని గోదావరిలో నిన్న 8 మంది యువకులు గల్లంతైన విషయం విదితమే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సోమవారం గోదావరిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో కొట్టుకుపోయారు. కె. గంగవరం మండలం, శేరులంకకు చెందిన పొలిశెట్టి అభిషేక్ తన ఇంట్లో జరిగిన వేడుకకు స్నేహితులను ఆహ్వానించాడు. కాకినాడ, రామచంద్రాపురం, మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు ఈ వేడుకకు హాజరయ్యారు.
వీరిలో కొందరు మధ్యాహ్నం భోజనాల తర్వాత ఈత సరదా తీర్చుకునేందుకు గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు. 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా, 8 మంది గల్లంతయ్యారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.