ఎస్ఐఆర్–2026 షెడ్యూల్ సవరణ విడుదల
- ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ – అక్టోబర్ 12న తుది జాబితా విడుదల
పరిగి, జూలై 15 (ప్రజాజ్యోతి):
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 01 అక్టోబర్ 2026ను అర్హత తేదీగా నిర్ణయించి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్–2026) కార్యక్రమానికి సంబంధించి సవరించిన నూతన షెడ్యూల్ను విడుదల చేసినట్లు 54-పరిగి నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి కార్యాలయం వెల్లడించింది.
నూతన షెడ్యూల్ ప్రకారం బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఆగస్టు 3న పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ కొనసాగనుంది.
అలాగే ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు అందిన క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలన మరియు పరిష్కార ప్రక్రియ చేపట్టి, అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
ఈ నేపథ్యంలో పరిగి నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పౌరులందరూ తమ ఓటు నమోదు, పేరు మార్పులు, చిరునామా సవరణలు తదితర అంశాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. ప్రజలు బీఎల్ఓలను సంప్రదించి అవసరమైన వివరాలు సమర్పించాలని సూచించారు.
