మహిళ గల్లంతు కేసు హత్యగా ఛేదన..
మహిళను హత్య చేసి ఆభరణాలు దోచుకున్న ముగ్గురు అరెస్ట్
శవాన్ని కాల్చి నేరం దాచే యత్నం – వేగంగా విచారణ చేసి కేసును ఛేదించిన పోలీసులు
పరిగి, ఏప్రిల్ 08 (ప్రజా జ్యోతి):పరిగి సర్కిల్ పరిధిలోని కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన మహిళ గల్లంతు కేసు సంచలన మలుపు తిరిగి హత్య అలాగే దొంగతనం కేసుగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వేగవంతమైన దర్యాప్తుతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసును ఛేదించారు.
గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామానికి చెందిన బాపనిపల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఈ నెల 5న తన తల్లి కొత్తబావి వెంకటమ్మ గల్లంతైనట్లు కేసు నమోదు చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరిపారు. ఈ క్రమంలో బండవేల్కిచెర్ల గ్రామానికి చెందిన చిపిరి మంజుల (35), ఆమె భర్త భీరయ్య, బంధువు కోడిగంటి అరుణ్ కుమార్ అలియాస్ బీరప్ప కలిసి పథకం ప్రకారం వెంకటమ్మను మద్యం తాగించి తిర్మలాపూర్ సమీప అడవి ప్రాంతానికి తీసుకెళ్లి చున్నితో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది.
అనంతరం మృతురాలి వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్లను దోచుకొని నేరాన్ని మరుగుపరచేందుకు శవాన్ని రాళ్ల మధ్య పడేసి పెట్రోల్ పోసి కాల్చివేసినట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించిన వస్తువులను కామునిపల్లి గ్రామంలో దాచినట్లు గుర్తించారు.
ఏప్రిల్ 8న నిందితురాలు మంజులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకోగా, ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు కలిసి ఈ నేరాన్ని చేసినట్లు అంగీకరించారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నారు.
ఈ ఘటనలో మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో లభించగా, ఫిర్యాదుదారు చీర ముక్క ఆధారంగా తన తల్లిని గుర్తించారు. నిందితుల నుంచి బంగారు నెక్లెస్, చెవి దిద్దులు, గుండ్లు, వెండి కడియాలు, పట్టగొలుసులు, రెండు సెల్‌ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును వేగంగా ఛేదించిన కుల్కచర్ల పోలీస్ సిబ్బందిని పరిగి డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐ రమేష్ కుమార్ తోపాటు రైటర్ శంకరయ్య, సీసీటీఎన్ఎస్ రైటర్ రాఘవేందర్, పీసీలు భూపాల్ రెడ్డి, శివ, గోపాల్ అలాగే మొగులయ్య హెచ్‌జీ తదితరుల సేవలను ప్రశంసించారు.
