- కొనుగోళ్ల జాప్యంపై రైతన్నల ఆగ్రహం..
- జాతీయ రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో
నర్సాపూర్/కౌడిపల్లి (ప్రజాజ్యోతి) ఆరుగాలం చెమటోడ్చి దేశానికి అన్నం పెట్టే చేతులకు నేడు నడిరోడ్డుపై కన్నీళ్లే మిగిలాయి. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం కారణంగా గత రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. దీంతో గుండె పగిలిన వెంకటరావుపేట్ రైతులు బుధవారం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ఆందోళనతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఎస్సై అమరేందర్ రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ప్రభుత్వంలో అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారనీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అన్నదాతల కష్టం కనబడడం లేదా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మార్వో, డీఎంలు వచ్చి తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని రైతులు కన్నీటితో తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఎట్టకేలకు ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని ఎస్సై గట్టి భరోసా ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు.
