ఆరేళ్ల క్రితం ఆడుకుంటూ మాయమై.. అస్థిపంజరమై కనిపించిన చిన్నారి

V. Sai Krishna Reddy
1 Min Read

ఉత్తరప్రదేశ్‌లో ఆరేళ్లుగా అంతుచిక్కకుండా ఉన్న బాలుడి అదృశ్యం కేసులో విషాదాంతం చోటుచేసుకుంది. 2020లో ఇంటి పెరట్లో ఆడుకుంటూ మాయమైన ఏడేళ్ల ‘ప్రిన్స్’ అలియాస్ టిల్లూ, సొంత బంధువుల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు తేల్చారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో బాలుడి అస్థిపంజరాన్ని పోలీసులు వెలికితీశారు.

2020 ఆగస్టు 16న ప్రిన్స్ తన ఇంటి పెరట్లో ఆడుకుంటూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే, ఈ కేసులో మొదటి నుంచి బాలుడి చిన్నాన్న, చిన్నమ్మ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం ఉన్నప్పటికీ, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు ముందుకు సాగలేదు.

ఇటీవల ఈ కేసును తిరిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. కుటుంబ, ఆస్తి తగాదాల కారణంగానే బాలుడిని గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌వే పక్కన గొయ్యి తీసి పూడ్చిపెట్టినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు.

నిందితులు చూపిన ప్రదేశంలో తవ్వకాలు జరపగా, బాలుడి అస్థిపంజరం, కొన్ని బట్టలు లభ్యమయ్యాయి. ఈ అవశేషాలు ప్రిన్స్‌వేనా కాదా అని నిర్ధారించుకునేందుకు వాటిని డీఎన్ఏ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. ఆరేళ్లుగా తమ కొడుకు ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడని ఆశతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు ఈ వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రస్తుతం నిందితులు పోలీస్ కస్టడీలో ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *