హైవేపై మృత్యుఘోష.. ఐదుగురు పోలీసులను బలిగొన్న ప్రమాదం

V. Sai Krishna Reddy
1 Min Read

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝార్సుగూడ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఓ భారీ ట్రైలర్, పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఐదుగురు సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఝార్సుగూడ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-49పై తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విధులు ముగించుకుని బొలెరో వాహనంలో తిరిగి వస్తున్న పోలీసు సిబ్బందిని, ఎదురుగా అతివేగంగా వస్తున్న ట్రైలర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసు వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో డ్రిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ కుజుర్, ఏపీఆర్ సిబ్బంది కాశీరామ్ భోయ్, దేవదత్త సా, హవల్దార్ లింగరాజ్ ధురువా, హోమ్ గార్డ్ భక్తబంధు మిర్ధా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఝార్సుగూడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ప్రమాదానికి కారణమైన ట్రైలర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటించే అవకాశం ఉంది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *