రేవంత్ రెడ్డి ఆ రోజు రాళ్లతో కొట్టమన్నారు కానీ..!: జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమని చెప్పారని, కానీ ఇప్పుడు నేను ఓట్లతో కొడదామని చెబుతున్నానని కాంగ్రెస్ పార్టీ జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సంజయ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను అధికార పార్టీలో చేరలేదని, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని వివరణ ఇచ్చారు. నాటి నుంచి జీవన్ రెడ్డి అలక బూనారు.

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లోనూ సంజయ్ వర్గానికి ముప్పై సీట్లు, తన వర్గానికి 20 సీట్లు మాత్రమే ఇచ్చారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారి తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న చెప్పారని, అలాంటప్పుడు ఆయన అదే పార్టీలో ఉండాలని, కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఆయన పార్టీని చక్కదిద్దుకోవాలి తప్ప తన పార్టీలో చిచ్చు పెట్టవద్దని సూచించారు. ఇన్నాళ్లు తాను పార్టీ జెండాను మోస్తే ఇప్పుడు వచ్చి ఆయన తన్నుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు నా గొంతు కోద్దామని చూస్తున్నారని, తన గొంతు కోయాలంటే తన కార్యకర్తలను దాటి రావాలని అన్నారు. జీవితం అయిపోయే ముందు తనకు దుఃఖం తెప్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టమని చెప్పినప్పటికీ మనం ఓటు అనే ఆయుధంతో కొడదామని అన్నారు. చేయి గుర్తును తన్నుకుపోయారని అన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *