తెలంగాణకు జరిగిన ద్రోహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీలు బాధ్యులని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. నీటి వాటాల విషయంలో రేవంత్ ప్రభుత్వానికి కనీస సోయి కూడా లేదని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో వాటాకు మించిన నీళ్లను ఏపీ తీసుకెళుతోందని చెప్పారు. సాగర్ ఎడమ కాలువ కింద సాగు, తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ దోపిడీతో తెలంగాణలో నీటికి కటకట ఏర్పడే పరిస్థితి నెలకొందని అన్నారు.
కృష్ణా నీళ్ల దోపిడీ జరుగుతోందని, అడ్డుకోవాలని హరీశ్ రావు సలహా ఇస్తే… కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలపై మాట్లాడటం మానేసి… కేంద్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. మన హక్కుగా ఉన్న 123 టీఎంసీల నీటి గురించి మాట్లాడాలని చెప్పారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తెలంగాణకు వస్తే గౌరవించుకోవద్దా? అని ప్రశ్నించారు. మీరంతా చంద్రబాబు వద్దకు క్యూ కట్టలేదా? అని అడిగారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో సాగు, తాగు నీటికి ఎప్పుడూ ఇబ్బంది రాలేదని జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు, జగన్ ఒకే వైఖరితో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రాజశేఖరరెడ్డి కేబినెట్ నుంచి బయటకు వచ్చిందని చెప్పారు.