సంగెం మండలంలో తండాలో మూడు రోజులుగా నీటి సరఫరా బంద్.. -సర్పంచ్ నిర్లక్ష్యం పై తండా ప్రజల తీవ్ర ఆగ్రహం..

Warangal Bureau
1 Min Read

“ఓట్లప్పుడు గుర్తొచ్చిన వీఆర్ఎన్ తండా”..నీళ్లడిగితే పట్టదా..!

-మూడు రోజులుగా నీటి సరఫరా బంద్..

-సర్పంచ్ నిర్లక్ష్యం పై తండా ప్రజల తీవ్ర ఆగ్రహం

సంగెం, మే26 (ప్రజాజ్యోతి):

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తండాల చుట్టూ తిరిగే నాయకులకు,గెలిచిన తర్వాత తండా ప్రజల కష్టాలు పట్టవా అంటూ వీఆర్ఎన్ తండావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మండల పరిధిలోని వీఆర్ఎన్ తండాలో గత మూడు రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు.ఎండలు మండిపోతున్న ఈ తరుణంలో కనీసం తాగడానికి కూడా నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఊరిలో నీటి సౌకర్యం లేకపోవడంతో వేరే మార్గం లేక, కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి పైపుల ద్వారా నీటిని ఇళ్లకు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తండా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్పంచ్ నిర్లక్ష్యం పై నిరసన:

తండాలో గత మూడు రోజులుగా ఇంతటి తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్నా,స్థానిక వీఆర్ఎన్ తండా సర్పంచ్ కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని,ప్రజల ఇబ్బందులను పూర్తిగా గాలికొదిలేశారని తండావాసులు మండిపడుతున్నారు.సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

నీళ్లందక రాస్తారోకో కు సిద్ధమైన తండావాసులు:

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి వీఆర్ఎన్ తండాకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఖాళీ కుండలతో పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేస్తామని తండా మహిళలు,యువకులు హెచ్చరిస్తున్నారు..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *