ఎమ్మెల్యే పర్యటన ఉంటేనే పారిశుధ్య పనులా..?

Warangal Bureau
1 Min Read

ఎమ్మెల్యే పర్యటన ఉంటేనే పారిశుధ్య పనులా..?

 

-ఇన్ని రోజులు కంటికి కనిపించని చెత్త.. నేడే సఫాయి!

-అధికారుల “కంటితుడుపు” చర్యలపై ప్రజల తీవ్ర ఆగ్రహం

 

సంగెం, సెప్టెంబర్17(ప్రజాజ్యోతి):

సమస్యలు తీవ్రమై ప్రజలు అల్లాడుతున్నప్పుడు పట్టించుకోని స్థానిక అధికారులు, నాయకులు ఎమ్మెల్యే పర్యటన ఉందనగానే ఒక్కసారిగా నిద్రలేవడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో సంగెం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద హడావుడిగా చేపడుతున్న పారిశుధ్య పనులను చూసి “ఇన్ని రోజులు లేని పారిశుధ్యం ఇప్పుడే గుర్తొచ్చిందా?” అని ప్రజలు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా డ్రైనేజీలు పొంగిపొర్లుతూ, వీధుల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయి దోమల వ్యాప్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదని, కానీ ప్రజాప్రతినిధి వస్తున్నారని తెలిసి ఊరంతా శుభ్రం చేయడం అధికారుల కంటితుడుపు చర్యలకు అద్దం పడుతోందని మండిపడుతున్నారు.

 

అధికారుల ఉద్దేశం ఏమిటి..?

కేవలం ప్రజాప్రతినిధి దృష్టిలో మంచి మార్కులు కొట్టేందుకు, అధికారుల నుంచి ఎలాంటి చర్యలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులను మభ్యపెట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారా? లేక నిత్యం ప్రజల ఆరోగ్యం కాపాడటం వారి బాధ్యత కాదా? అని ప్రశ్నిస్తున్నారు.

ప్రజాప్రతినిధుల పర్యటనల సమయంలోనే కాకుండా, ప్రతిరోజూ వీధుల్లో పారిశుధ్య పనులు సరిగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో స్థానిక అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *