సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి
రైతులకు మెరుగైన సేవలు అందించడమే నూతన పాలకవర్గాల లక్ష్యం కావాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఆత్మకూరు చైర్మన్ “నాగేల్లి స్వప్న ఆంధ్రయ్య”
పెంచికలపేట చైర్మన్ “ఎగితే లింగన్న”
ఆత్మకూరు, అక్టోబర్ 30 (ప్రజాజ్యోతి):
సహకార సంఘాల అభివృద్ధికి నూతన పాలకవర్గాలు సమష్టిగా కృషి చేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం ఆత్మకూరు, పెంచికలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్ లు పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆత్మకూరు చైర్మన్ నాగేల్లి స్వప్న ఆంధ్రయ్య, పెంచికలపేట చైర్మన్ గా ఎగితే లింగన్న లతో పాటు పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలక వేదికలని, వాటిని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించడం, వారి సమస్యలను పరిష్కరించడం నూతన పాలకవర్గాల ప్రధాన బాధ్యతగా భావించాలని సూచించారు. రైతు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసేలా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని సూచించారు. క్లస్టర్ వారీగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌పీఓ) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ సేవలను సకాలంలో అందించడంలో పీఏసీఎస్ సంఘాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, రైతులు, సొసైటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



