నర్సాపూర్(ప్రజాజ్యోతి) పదేళ్ల డబుల్ బెడ్‌రూమ్ వంచనకు కాలం చెల్లిందని, ఇందిరమ్మ ఇళ్లతోనే పేదల సొంతింటి కల సాకారమవుతుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం నర్సాపూర్‌లో లబ్ధిదారులతో కలిసి ఆయన గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రస్తుతం 3,500 ఇళ్లు నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది మరో 2,500 ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఐదేళ్లలో 17 లక్షల ఇళ్లే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
