- డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా నర్సాపూర్‌లో భారీ ర్యాలీ
- ప్రభుత్వ వైఖరిపై విమర్శలు.. అడుగడుగునా పోలీసుల పహారా
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడోవ రోజుకు చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించడంతో ఆర్టీసీ ఉద్యమం మరింత అగ్గిని రాజేసింది.
• శంకర్ గౌడ్ అమరత్వానికి నినాదాలు
శుక్రవారం శంకర్ గౌడ్ మృతికి నిరసనగా నర్సాపూర్ డిపో జేఏసీ చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్థానిక చిల్డ్రన్స్ పార్క్ నుండి డిపో వరకు, అక్కడి నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి శంకర్ గౌడ్ అమరత్వానికి నినాదాలు చేశారు. భాజాపా మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, నాయకులు నిలి నాగేష్, రాజేందర్ తదితరులు పాల్గొని కార్మికులకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్మికుల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు.
