మీ సేవా సర్వర్ బంద్ – రెండు రోజులుగా నిలిచిపోయిన మీ సేవలు..

Warangal Bureau
2 Min Read
  • మీ సేవా సర్వర్ బంద్ – రెండు రోజులుగా నిలిచిపోయిన మీ సేవలు
  • పేమెంట్ గేట్‌వే లోపాలతో నిలిచిపోయిన సేవలు

హనుమకొండ, ఏప్రిల్ 25 (ప్రజాజ్యోతి):

రాష్ట్ర వ్యాప్తంగా “మీ సేవ” కేంద్రాల సేవలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా సర్వర్లు సరిగా పని చేయకపోవడంతో పలు సేవలు పూర్తిగా స్థంభించి పోయాయి. పేమెంట్ గేట్‌వేలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్ చెల్లింపులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు వంటి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఆదాయ ధృవపత్రాలు, కుల ధృవపత్రాలు, రేషన్ కార్డు సంబంధిత సేవలు, పింఛన్ దరఖాస్తులు వంటి అవసరాల కోసం మీ సేవ కేంద్రాలకు వస్తుండగా, సర్వర్ పనిచేయకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది అయితే పనులు పూర్తి కాకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.

ఇక కేంద్ర నిర్వాహకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ సేవకు వచ్చే కొందరు అర్ధం చేసుకో కుండా ఇబ్బంది పెడుతున్నట్టు మీ సేవ ఆపరేటర్లు వాపోతున్నారు. రోజువారీ ఆదాయం పూర్తిగా ఆగిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వారు చెబుతున్నారు. “సర్వర్ ఎప్పుడు వస్తుందో తెలియదు… పై అధికారుల నుంచి కూడా స్పష్టత లేదు” అని పలువురు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకొని సర్వర్లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా అత్యవసర సేవలు నిలిచిపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

టెక్నీకల్ సమస్య వచ్చింది, టీం వర్క్ చేస్తున్నారు, సహకరించాలి..

  •  మీ సేవ ఆపరేటర్ల రాష్ట్ర అధ్యక్షులు ‘రావిపాటి దేవేందర్ రావు’

మీ సేవ పేమెంట్ గేట్ వే లో టెక్నీకల్ సమస్య వచ్చింది. అది గుర్తించి సమస్య పరిష్కారం చేసే దిశగా టీం వర్క్ చేస్తున్నారు. మీ సేవ సర్వర్లలో ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు టెక్నీకల్ సిబ్బంది పని చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఒకటి రెండు రోజుల్లో సమస్య లేకుండా మీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *