గరిడేపల్లి,ఏప్రిల్ 16(ప్రజా జ్యోతి):మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు జనాభా ప్రాతిపదికగా 50 శాతం సబ్‌కోటా కేటాయించాలని బీసీ మహిళా నాయకురాలు చీకూరి లీలావతి డిమాండ్ చేశారు.ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె మాట్లాడుతూ,అన్ని రాజకీయ పార్టీలు బీసీ మహిళల హక్కులను పరిరక్షించే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.బీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే మహిళా రిజర్వేషన్లలో సముచిత వాటా అవసరమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం సరైన చర్యలు తీసుకోకపోతే అగ్రవర్ణాల మహిళలకే అధిక ప్రాధాన్యం దక్కే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.బీసీ మహిళలు నారిశక్తిగా ఒకటై తమ హక్కుల కోసం గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రతి బీసీ మహిళా స్వరం పార్లమెంట్ వరకు చేరేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.ఈ సందర్భంగా “ఒక పోరాటం” స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలిగా, బీసీ మహిళల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని చీకూరి లీలావతి తెలిపారు.
