మొక్కజొన్న కొనుగోలు లో నిర్లక్ష్యం. రైతులకు మద్దతుగా బీజేపీ నాయకుల రాస్తారోకో.
వర్ధన్నపేట, ఏప్రిల్ 15, ప్రజా జ్యోతి::
వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
మొక్కజొన్న కాంటాలు ఆలస్యంగా జరగడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని తరలించేందుకు సరైన రవాణా సదుపాయం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వెంటనే ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించి, కాంటాల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో బీజేపీ జిల్లా నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి, పింగిలి సంపత్ రెడ్డి, వడ్డే దేవేందర్, మహిళా నాయకురాలు సొల్లేటి హైమావతి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న వర్ధన్నపేట ఎస్సై సాయి బాబు ఘటనాస్థలానికి చేరుకుని రైతులు, బీజేపీ నాయకులతో మాట్లాడారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కాంటాలు పూర్తిచేయడంతో పాటు ధాన్యం రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
