దాతృత్వానికి అవమానం గ్రామ సేవకు ఇచ్చిన ఫ్రీజర్ బాక్స్ తిరిగి దాత ఇంటికి

Nalgonda Bureau
1 Min Read

గరిడేపల్లి, ఏప్రిల్ 05(ప్రజా జ్యోతి):సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని వెలిదండ గ్రామంలో సామాజిక సేవకు నిదర్శనంగా అందించిన ఫ్రీజర్ బాక్స్ వ్యవహారం ప్రస్తుతం వివాదాస్పదంగా మారడమే కాకుండా దాతృత్వానికి అవమానంగా మాయని మచ్చలా ఏర్పడింది.స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు గడ్డం లక్ష్మీ నరసయ్య జ్ఞాపకార్థంగా 2022 సెప్టెంబర్ నెలలో గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామానికి ఫ్రీజర్ బాక్స్ ను గడ్డం అనిల్ కుమార్ అందించారు.ఈ ఫ్రీజర్ బాక్స్ నిర్వహణ బాధ్యతలను 2024 మార్చి వరకు అప్పటి సర్పంచ్ ఆధురి పద్మ కోటయ్య నిర్వహించారు.అనంతరం పాలకవర్గం గడువు ముగియడంతో,దాతలకే బాధ్యతలు అప్పగించారు.2025 సర్పంచ్ ఎన్నికల సమయంలో సర్పంచ్ గా ఎన్నుకోబడిన చెనగాని సాంబయ్య,కార్యదర్శి నాగేంద్ర బాబులు ఫ్రీజర్ బాక్స్ నిర్వహణను గ్రామపంచాయతీ తీసుకుంటామని దాత గడ్డం అనిల్ కుమార్‌ను గత పది రోజుల క్రితం సంప్రదించగా దానికి ధాత కూడా సరేనని అన్నాడు.కాగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బంది అకస్మాత్తుగా ఫ్రీజర్ బాక్స్‌ను దాత ఇంటి వద్దకు తీసుకువచ్చి వదిలివేయడం సంచలనంగా మారింది.ఆ సమయంలో ధాత అట్టి సిబ్బందిని ఫ్రీజర్ బాక్స్ ఎందుకు మా ఇంటి ముందు వదిలి వెళ్తున్నారని ప్రశ్నించగా గ్రామ సర్పంచ్,వార్డు సభ్యుల తో కూడిన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఈ ఫ్రీజర్ బాక్స్‌ను గ్రామానికి ఇవ్వడం ఇష్టం లేదని తీర్మానం చేసినట్లు సమాచారం ఇచ్చారు.ఈ చర్యను దాత గడ్డం అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు.తాను చేసిన సేవను రాజకీయ దురుద్దేశంతో కించపరుస్తూ ఇలా వ్యవహరించ డం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.గ్రామ ప్రజలకు ఉపయోగపడే సేవా వస్తువును ఇలా తిరస్కరించడం పట్ల స్థానికుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *