బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ కీలక సమావేశం

V. Sai Krishna Reddy
1 Min Read

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కేటీఆర్, ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు, రాబోయే కార్యక్రమాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఇటీవల ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి కేసీఆర్‌కు రాసిన అంతర్గత లేఖ బయటకు రావడం, ఆ తర్వాత ఆమె మీడియా సమావేశంలో “కేసీఆర్‌ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి” అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనూ, రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ లేఖ, కవిత వ్యాఖ్యలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ను కేటీఆర్ కలవడం ప్రాధాన్యంత సంతరించుకుంది. పార్టీలోని ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై వీరిద్దరూ సమీక్షించుకున్నట్లు సమాచారం.

మరోవైపు, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పార్టీ ఆధ్వర్యంలో ఏ విధంగా నిర్వహించాలనే దానిపై కూడా వీరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. కాగా, కేటీఆర్ ఈ నెల 28వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 1న అక్కడ నిర్వహించే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో, అమెరికా పర్యటనకు ముందే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలపై ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించేందుకే కేసీఆర్‌తో కేటీఆర్ చర్చించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *