తన పేరిట వసూళ్లు… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌లోని నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి పీఏలమని చెప్పుకుంటూ వీరు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి (30), మచ్చ సురేశ్ (30) అనే ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం హైదరాబాద్ నాగోల్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీరిలో సురేశ్ చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామస్థుడు కాగా, బుస్సా వెంకటరెడ్డి భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందినవాడు. సురేశ్ హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

వీరిద్దరూ కొంతకాలంగా తాము మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీఏలమని ఫోన్లలో పరిచయం చేసుకుంటూ మోసాలకు తెరలేపారు. సురేశ్ తన మొబైల్ నంబర్ నుంచి పలువురు అధికారులకు ఫోన్లు చేశాడు. మార్చి 29న చౌటుప్పల్ సీఐకి ఫోన్ చేసి, అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ మహిళ పోస్టుమార్టం నివేదిక కావాలని అడిగాడు. నార్సింగి సీఐకి ఫోన్ చేసి ఓ సివిల్ కేసులో తమ వారికి అనుకూలంగా వ్యవహరించాలని కోరాడు.

సికింద్రాబాద్ జేబీఎస్ పర్సనల్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి ఓ డ్రైవర్ బదిలీ గురించి, ఘట్‌కేసర్ ఎక్సైజ్ సీఐకి ఫోన్ చేసి గంజాయి కేసులో పట్టుబడిన వాహనం విడుదల గురించి మాట్లాడాడు. అంతేకాకుండా, ఓ డిగ్రీ కాలేజీ యాజమాన్యానికి సీటు విషయంలో, యూనియన్ బ్యాంక్ మేనేజర్‌కు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం మంజూరు చేయాలని ఫోన్లు చేసినట్లు తెలిసింది.

మరో నిందితుడు వెంకటరెడ్డి సైతం ఇదే తరహాలో గోపాలపురం ఎస్సై, ట్రాఫిక్ సీఐ, భూపాలపల్లి సీఐ, ఉప్పల్ సీఐ, టపాచపుత్ర సీఐ, నాచారం సీఐ, పెద్దకొత్తపల్లి సీఐ, నాగోల్ సీఐలతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పీఏకు కూడా ఫోన్ చేసి, పలు పనుల విషయమై తమకు అనుకూలంగా ఉండాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

వీరి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పలువురు అధికారులు మంత్రి పొంగులేటి వద్ద డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్‌గా (డీపీఓ) పనిచేస్తున్న నరేశ్‌ను సంప్రదించారు. ఈ పేర్లతో ఎవరూ మంత్రి వద్ద పీఏలుగా పనిచేయడం లేదని నిర్ధారణ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నరేశ్ వెంటనే నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సాంకేతిక ఆధారాలతో నిందితులిద్దరినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

స్పందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఈ ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. తన పేరు చెప్పి ఎవరు మోసాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా తన పీఏలమని ఫోన్ చేస్తే అనుమానం వస్తే, వెంటనే సచివాలయంలోని తన కార్యాలయ నంబర్లు 040-23451072… 040-23451073కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *