సిద్దిపేట, సెప్టెంబర్ 18 ,( ప్రజాజ్యోతి ): ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర అంశాలను తెరపైకి తెస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. తన వ్యవసాయ భూమి అంశంపై కాంగ్రెస్ ఎంపీల బృందం పర్యటనను ఆయన ప్రస్తావిస్తూ, తన భూమిలో ఎలాంటి అక్రమం ఉన్నట్లు నిరూపించినా మొత్తం 13 ఎకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. శుక్రవారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.తన వ్యవసాయ భూమిలో విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉందన్న ఆరోపణలు అవాస్తవమని హరీశ్‌రావు అన్నారు. తన భూమిలో కనీసం బాత్రూం కూడా లేదన్నారు. 2018 నుంచి 2024 వరకు విడతల వారీగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశానని, అందుకు సంబంధించిన అధికారిక పత్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. భూమి హద్దుల నిర్ధారణ కోసం ఆర్డీవో, కలెక్టర్, సర్వే అధికారులను సంప్రదించి, ప్రభుత్వ రుసుము చెల్లించి సర్వే చేయించుకున్నానన్నారు.రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం 13 ఎకరాల 12 గుంటలు ఉండగా, సర్వే అనంతరం తన స్వాధీనంలో 13 ఎకరాల 10 గుంటలు మాత్రమే ఉన్నట్లు తేలిందని హరీశ్‌రావు తెలిపారు. కొనుగోలులో ఒక్క చిన్న తప్పు ఉన్నా మొత్తం భూమిని ప్రభుత్వానికి వదులుకుంటానని తెలిపారు.సిద్దిపేట పరిధిలోని రంగధాంపల్లి, ఎన్సాన్పల్లి, మిట్టపల్లి, పొన్నాల తదితర ప్రాంతాల్లో సుమారు 3 వేల ఇళ్ల స్థలాలు 22ఏ నిషేధిత జాబితాలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాలను విక్రయించుకోలేక, అవసరాలకు భూములను వినియోగించుకోలేక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.తన భూమిపై పరిశీలనకు వచ్చిన ఎంపీల బృందానికి 22ఏ బాధితుల సమస్యలను కూడా చూపించాలని భావించానని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.సిద్దిపేట వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, రంగనాయకసాగర్ టూరిజం ప్రాజెక్టు తదితర పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు అన్నారు. రైతులకు విద్యుత్, సాగునీరు, రుణమాఫీ వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని రహదారుల దుస్థితిని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు.
ఎంపీల పర్యటన సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పర్యటనలు చేపట్టడం మంచిదేనని, అయితే రాష్ట్రానికి సంబంధించిన హక్కులు, సాగునీటి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతుల కోసం కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేసేందుకే సస్పెన్షన్లు చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమన్నారు.కేసీఆర్‌పై దళితుల భూములకు సంబంధించి చేసిన ఆరోపణలపైనా హరీశ్‌రావు స్పందించారు. ఆరోపణలు నిరూపితం కాకపోతే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. అదే విధంగా ఆరోపణలు నిజమని తేలితే తాము రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు.ప్రభుత్వం ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, 22ఏ బాధితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపించండి
-నా భూమిలో తప్పు చూపిస్తే ప్రభుత్వానికే రాసిస్తా
Leave a Comment
