నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ఎన్నికల వేళ ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీ’ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు వినూత్న రీతిలో నిరసన బాట పట్టాయి. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు శుక్రవారం “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నేలలు గడుస్తున్నా, ప్రధాన హామీలైన రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ. 2,500 వంటి పథకాలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం ఎంత మొత్తంలో ‘బాకీ’ పడిందో లెక్కలతో సహా కరపత్రంలో గురించి ప్రచారం చేశారు. రైతులకు రుణమాఫీ సక్రమంగా జరగలేదని, యువతకు నిరుద్యోగ భృతి ఊసే లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ నాయకులను ఈ బాకీల గురించి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పండగ పూట రాజకీయ వేడి పుట్టించిన ఈ ‘బాకీ కార్డుల’ వ్యవహారం నర్సాపూర్ పట్టణంలో చర్చనియాంశమైంది.
